అందం-సుగంధం
వరములు ఇచ్చెడి దేవత నీవు
వర్ణనకి అందని పదము నీవు.
నీ నడకలో ఆడింది నాట్యమయూరి
గొంతులో పాడింది సప్తస్వర కచేరి.
ఆ దివిలో అందం నీ రూపంకోరి శిల్పంగా మారి
ఇలకు ఇలా జారి తరించింది నినుచేరి.
నిను పొగిడే ఏ మాట రానే రాదే ఈ తెలుగు నోట.
చంద్రునిలో వెలుగంతా వలచెను నిన్ను హిమమై
సూర్యునిలో ఎరుపంతా నిలిచెను నీ నుదుట కుంకుమై.
నీ ధ్యాసే నిరంతమై నీ అందం నాకో వరమై
నీ శబ్దమే నిశ్శబ్దమై రేపింది నా యదలో కలవరమై
పదాలు లేవే ఈ పూట నిను తలచే చోట.
ఊగే నీ కురులఝరులు ఈ సృష్టికే జీవనదులు
అలిగే నీ అధరాలు మర్చిపోలేని మధురాలు.
నీ తలపులు వెన్నెల తీరంలో ఆగని అలలు
నా కన్నుల తీరంలో చెదరని కలలు.
నిను స్తుతించే పదాలు గతించి పోయాయేమో.
పదాలు లేని పోలిక నీవు.
ఓ చెలి..నిన్ను రాసిన నా కలం
చరితలో నిలుస్తుంది చిరకాలం...
Comments
Post a Comment